AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్… మణిపూర్ లో ఘోరం

తన పైఅధికారితో వాదన పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ఆవేశం పట్టలేక కాల్పులు జరిపాడు. తన సర్వీస్ రైఫిల్ తో పాయింట్ బ్లాక్ రేంజ్ లో ఎస్సైపై కాల్చాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ ఘోరం. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మణిపూర్ లో కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్ట్ లు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జిరిబామ్ జిల్లా మాంగ్ బంగ్ గ్రామంలోని పోలీస్ పోస్ట్ లో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్, ఎస్సై షా జహాన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

ఆ కోపంలోనే తన సర్వీస్ రైఫిల్ తీసుకుని ఎస్సై షా జహాన్ పై కాల్పులు జరిపాడు. దీంతో కుర్చీలో కూర్చుని ఉన్న షా జహాన్ కు బుల్లెట్ గాయమైంది. చాలా దగ్గరి నుంచి బుల్లెట్ తాకడంతో షా జహాన్ అదే కుర్చీలో తుదిశ్వాస వదిలాడు. పోలీస్ పోస్ట్ లోని మిగతా సిబ్బంది బిక్రమ్ జిత్ ను అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

కాగా, కానిస్టేబుల్, ఎస్సైల మధ్య వాగ్వాదానికి కారణమేంటనే విషయం ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10