రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో చాలా రోజులకు ప్రోటోకాల్ కనిపించిందన్నారు. పార్టీలకతీతంగా నాయకులు, అధికారులు సంతోషంగా ఉన్నారని, మున్ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పగలు, పట్టింపులతో సాధించేది ఏమీ ఉండదన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్ రోడ్డు నుంచి మేడిపల్లి మండలం కాచారం వరకు రూ.25 కోట్లతో డబుల్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ ప్రోటోకాల్ పాటించలేదని విమర్శించారు.
ఎప్పుడు కమీషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అందరూ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందినట్లు చెప్పారు. భవిష్యత్తులో చొప్పదండి నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువస్తామన్నారు.