AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ రెడ్డి సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. అయితే.. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వే కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన సర్వే నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 1న) రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించనున్న కుల గణన సర్వే నేపథ్యంలో 36,549 మంది ఎస్జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్లు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వీళ్లతో పాటుగా.. 6,256 మంది ఎంఆర్‌సీలు, 2 వేల మంది మినిస్టీరియల్‌ సిబ్బంది కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొననున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం కుల గణన నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణన సర్వేపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. 10 నవంబర్ 2023 రోజు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4 ఫిబ్రవరి 2024 రోజున జరిగిన మంత్రి మండలి నిర్ణయం మేరకు.. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి సమగ్ర సర్వే చేపట్టాలని తీర్మానించింనట్టు పొన్నం పేర్కొన్నారు. రాష్టంలో వెనుకబడిన తరగతుల, ఎస్సీ,ఎస్టీ పౌరులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రాజకీయ అవకాశాలను ప్లాన్ చేసి అమలు చేయడానికి గాను 16 ఫిబ్రవరి 2024 రోజున అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు.

ఈ మేరకు నవంబర్ 6 నుంచి 85,000 మంది ఎన్యూమరేటర్లు, ప్రతి 10 మంది ఏన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడుగా.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి సమగ్ర సమాచార సేకరణ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. డేటా ఎంట్రీ చేయడంతో పాటుగా 30 నవంబర్ లోపు ఈ సమాచార సేకరణ పూర్తి చేయాలని ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు.

ANN TOP 10