తెలంగాణ సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. ఎస్పీఎఫ్‌నకు చెందిన 214 మంది శుక్రవారం నుంచి సచివాలయం భద్రత బాధ్యతలు చేపట్టారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ఎస్పీఎఫ్‌నకు ప్రభుత్వం అప్పగించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ నేతృత్వంలో భద్రత సిబ్బంది శుక్రవారం సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయం ప్రారంభించిన తర్వాత మొదట్లో ఎస్పీఎఫ్ భద్రత నిర్వహించింది.
గతేడాది ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)కు అప్పగించారు. అయితే భద్రతతోపాటు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ వంటి పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్పీఎఫ్‌నకు సచివాలయం భద్రత బాధ్యతలు అప్పగించాలని ఆగస్టు 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భద్రత బాధ్యతలను టీజీఎస్పీ నుంచి తీసుకోవాలని ఎస్పీఎఫ్‌ను ఆదేశించింది.