తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ కుల గణన సర్వేపై బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్.. సర్వేకు సంబంధించిన విషయాలు వివరించారు. కుటుంబ సర్వే సమయంలో వివరాలు సేకరించేందుకు వచ్చినప్పుడు.. కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని నిరంజన్ హెచ్చరించారు. కుల గణన అనేది బృహత్తర కార్యక్రమమన్న నిరంజన్.. ప్రజలంతా ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామని గుర్తు చేసిన నిరంజన్.. అది నిరూపించుకునేందుకు ఈ సర్వే కీలకమని తెలిపారు. ఈ గణన ద్వారా బీసీలతో పాటు అన్ని కులాల జనాభా లెక్కలు, వారి ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని వివరించారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తమ దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని నిరంజన్ తెలిపారు.