తెలంగాణలో రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా రైతులకు మేలు జరగాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజా పాలనలో ప్రతి రైతు ఇంట్లో దీపావళి వెలుగుల్లా సంతోషంగా ఉండేలా రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు.
తెలంగాణ ఆయిల్ పామ్ రైతులకు దీపావళి వెలుగులు రాబోతున్నాయన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలలు ధర రూ.19 వేలు పైగా గిట్టుబాటు ధర ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఆయిల్ పామ్ టన్నుకు ఆరు వేలు ధర పెరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో రైతాంగం ఆర్థిక పరిస్థితి మారుతుందని.. తెలంగాణ ఆయిల్ పామ్ రైతాంగం దేశానికి మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షించారు మంత్రి. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలని సూచించారు మంత్రి నాగేశ్వరావు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు.
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన మలేషియా తరహా విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పామాయిల్ బోర్డును తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ బోర్డుతోపాటు సీడ్ గార్డెన్లు, విత్తన మొలకల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. మంత్రి ఇటీవల మలేషియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.