AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దీపావళి స్పెషల్.. భాగ్యలక్ష్మీ ఆలయంలో వెండి నాణేల పంపిణీ, పోటెత్తిన భక్తులు

పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పండుగ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో నాణేలు తయారుచేసి.. దీపావళి రోజు భక్తులను వాటిని అందజేస్తారు. ఈ ఆనవాయితీ కొన్నేళ్లుగా కొనసాగుతోందని ఆలయ ట్రస్టీ శంభు వివరించారు. అమ్మవారి రూపు ఉన్న వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.

వెండి నాణేలను అందుకోడానికి హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఇవి తమ అదృష్టాన్ని తెస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా భక్తులు నాణేలను పొందడం భాగ్యంగా భావిస్తుంటారు.

ఈసారి కూడా దీపావళి రోజున భాగ్యలక్ష్మీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయం వద్ద అయోధ్య ఆలయ నమూనాను పోలిన డెకరేషన్ మరింత ఆకట్టుకుంది. ఈ అద్భుతమైన డెకరేషన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. సంతోషం వ్యక్తం చేసిన భక్తులు.. ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు చార్మినార్, భాగ్యలక్ష్మీ దేవి దర్శనంతో పాటు అయోధ్య టెంపుల్ ను కూడా దర్శించుకునే అనుభూతి కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ANN TOP 10