బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు అరెస్ట్ కాగా తాజాగా ఆయంపైన కేసు నమోదు అయింది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో శ్రీనివాస్‌గౌడ్‌పై అధికారులు కేసు పెట్టారు. ఇటీవల బీఆర్‌ఎస్ కార్యకర్తపై వన్‌టౌన్ సీఐ దౌర్జన్యం చేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని బీఆర్‌ఎస్ కార్యకర్తను రబ్బరు బెల్టుతో సీఐ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఐ తీరును వ్యతిరేకిస్తూ పీఎస్ ముందు శ్రీనివాస్‌గౌడ్ ఆందోళనకు దిగారు. ఆ సమయంలోనే పోలీసుల తీరుపై శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని ఓ యువకుడిని జైల్లో వేసి పోలీసులు కొట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం వాట్సాప్ లో ప్రశ్నించినందుకు భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తిని మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య కొట్టిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్ కు ఫోన్ చేసిన జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు.