సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల గణన(Caste Census )విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వారి ప్రయత్నానికి కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన సమావేశంలో మహేశ్ మాట్లాడుతూ.. నవంబర్ 2న 33 జిల్లాలో కులగణనపై డీసీసీ అధ్యక్షుల సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణనపై తలెత్తే అనుమానాలపై గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని చెప్పారు. కులగణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
కుల గణన కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని దీనిని అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేశారని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నిష్పక్షపాతంగా సమగ్ర కులగణన చేపడతామని, అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
కులగణనకు సహకరించాలి..
దేశంలో తొలిసారి సమగ్ర కుల సర్వే జరిపేందుకు అన్ని ఏర్పాటు సిద్ధమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 6 నుంచి కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. సర్వేకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించాలని చెప్పారు. అధికారులకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.