దేశవ్యాప్తంగా రాష్ర్టాల అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. వచ్చే ఏడాది జనగణన నిర్వహించి, 2026లో జనాభా లెక్కలను ప్రకటిస్తామని సోమవారం కేంద్రం ప్రకటించింది.
2028లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వెల్లడించింది. మరోవైపు, ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు సానుకూలంగా మాజీ రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన నివేదికకు గత నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. దీంతో మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలికి సంబంధించిన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో 18 వరకూ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు లాజిస్టిక్స్ సమస్య కూడా ఎదురవ్వొచ్చని నిపుణులు చెప్తున్నారు. జమిలి బిల్లుకు ఎన్డీయేలోని ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా ఓటేస్తాయా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నే.