AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ కేసీఆరే! .. మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం తన విచారణను కొనసాగించింది. ఈ క్రమంలో గతంలో రెండు సార్లు విచారణకు హాజరైన విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మరోసారి కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా, కాళేశ్వరం డీపీఆర్‌ను అధికారులకు బదులు నాటి సీఎం కేసీఆర్‌ ఆమోదించినట్లు విచారణలో వెంకటేశ్వర్లు కమిషన్‌ ముందు అంగీకరించటమే గాక దీని దస్త్రాలను కమిషన్‌కు అందించారు.

అన్నీ ఆదేశాలే..
సాధారణంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్ల అంచనాలు, ఆలోచనల మేరకు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రూపొందించి, తుది చర్చల తర్వాత ఆమోదిస్తారని, కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన అంతా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే జరిగిందని వెంకటేశ్వర్లు కమిషన్ ముందు వెల్లడించారు. అలాగే కాళేశ్వరం డిజైన్లను ఫైనల్ చేయాలని కేసీఆర్ తమను ఆదేశించారని, ఆయన ఆదేశాలను పాటించటం తప్ప నాటి అధికారులకు మరోదారి లేకపోయిందని ఆయన కమిషన్ ముందు వాపోయారు. దీనికి రుజువుగా అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్లు, జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల వివరాల డాక్యుమెంట్లు, నాటి సమావేశాల మినిట్స్‌కు సంబంధించిన రికార్డులను, మూడు బ్యారేజీల వివరాలను ఆయన కమిషన్‌కు అందజేశారు.

అనంతరం ‘మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపాలే కారణమా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నింపమని చెప్పింది ఎవరు? అని కమిషన్ వెంకటేశ్వర్లును ప్రశ్నించింది. నాటి ప్రభుత్వాధినేత ఆదేశాల మేరకే తాము బ్యారేజీల్లో నీరు నింపామని వెంకటేశ్వర్లు కమిషన్‌ ముందు వెల్లడించారు. మేడిగడ్డ 7వ గేట్ కుంగుబాటుకు ఆపరేషన్, మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడమే కారణమని ఆయన కమిషన్‌ ముందు అంగీకరించారు.

ANN TOP 10