AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవ్ పార్టీ కేసుపై స్పందించిన కేసీఆర్.. డీజీపీకి ఫోన్..

హైదరాబాద్ లోని జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాల గురించి స్వయంగా రాష్ట్ర డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి ఆరా తీశారు. ఉదయం నుండి రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల, అతని కుటుంబ సభ్యుల గృహాలపై పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఈ తనిఖీలపై డిజిపితో ఫోన్లో కేసీఆర్ మాట్లాడుతూ .. సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని, వెంటనే సోదాలను ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర గృహాలలో సోదాలను నిర్వహిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే రేవ్ పార్టీ కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ ను ఎదుర్కోలేక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.  వ్యక్తులు తమ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేనప్పుడు, వారు తరచుగా వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ను అక్రమంగా అరెస్టు చేయడంతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతీకార రాజకీయాలు, ఫిరాయింపు వ్యూహాలను తాను ఖండిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతా ద్వారా హరీష్ రావు స్పందించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈ ట్వీట్ ను హరీష్ ట్యాగ్ చేశారు.

ANN TOP 10