అగ్రనేతల ప్రసన్నం కోసం పాట్లు
ఈసారి విస్తరణలో నలుగురికి ఛాన్స్
(మహా, హైదరాబాద్):
రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణ సీనియర్ నేతలను ఊరిస్తోంది. పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న మంత్రి పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవులు భర్తీ అవుతాయన్న ప్రచారంతో ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టేశారు. తమకు తెలిసి నేతల ద్వారా పైరవీలు చేస్తున్నారు. గతేడాది డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెండింగ్‌లో మరో ఐదు కేబినెట్ బెర్తులున్నాయి. ఆనాటి నుంచి మంత్రి విస్తరణ అదిగో ఇదిగో అంటూ ప్రచారం సాగుతోంది. కేబినెట్ విస్తరణపై ఫీలర్లు వచ్చిన ప్రతీసారీ ఆశావహులు లాబీయింగ్ చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం జరుగుతోంది.
ఎన్నికల నేపథ్యంలో..
జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల బిజీలో ఉండిపోయారు. దీంతో తెలంగాణ మంత్రి విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. ఆ రాష్ట్రాలు ఎన్నికలు పూర్తి కావడం.. లేటెస్ట్గా మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ నుంచి చాలామంది నేతలకు బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.
హస్తినకు అగ్రనేతల పయనం..
ఇదిలావుండగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హస్తిన బాట పట్టారు. సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ పనిలోపనిగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశముందన్నట్లు తెలుస్తోంది. కేబినేట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
నలుగురికి ఛాన్స్..
ఈసారి విస్తరణలో నలుగురుకి ఛాన్స్ దక్కవచ్చని గాంధీభవన్ వర్గాల మాట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నేతలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. దీంతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్ రావు, గడ్డం వివేక్ రేసులో ఉన్నారు. నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు హైకమాండ్ తనకు మాట ఇచ్చిందన్నది ఆయన వర్గీయులు చెబుతున్నారు. గ్రేటర్ కోటాలో దానం, మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తుందో.. ఎవరి ఆశలు ఆవిరవుతాయో తెలియాంటే వేచిచాడాల్సిందే..









