ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
మెదక్ జిల్లా ఉసరికపల్లి వద్ద ఘెర రోడ్డు ప్రమాదం
దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి దామోదర, మాజీ మంత్రి హరీశ్‌రావు
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొని పల్టీ కొట్టి కాల్వలో పడి ఏడుగురు జల సమాధి అయ్యారు. కారు నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. స్ధానికులు, బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివంపేట మండలం తాళ్లపల్లితండాకు చెందిన ధనావత్ శివరాం (55) అతని భార్య దుర్గమ్మ (50) ఇద్దరు కూతుళ్లు శాంతి (35), అనిత(30)లతో పాటు, శివరాం మనువరాళ్లు (శాంతి కూతురు) మమత(14), శ్రావణి (9), ఇందు (7) (అనిత కూతుళ్లు) నీళ్లలోనే ఊరిరాడక మృతి చెందారు. కారు నడుపుతున్న అల్లుడు నాంసింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు జల సమాదికావడంతో బాధిత బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాంసింగ్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

కారు డోర్లు లాక్ అయి.. ఊపిరాడక..
వీరంతా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లి తాండాలో తన సమీప బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు ఉసిరికపల్లి – వెల్దుర్తి ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొని నుజ్జు నుజ్జయి.. అదే వేగంతో పక్కనే ఉన్న దొంతి చెరువు కాలువలోకి పల్టీ కొట్టింది. కారు బోర్లా పడటంతో కారు డోర్లు తెరవడానికి వీలులేకుండా పోయింది. దీంతో ఊపిరాడక ఏడుగురు జలసమాధి అయ్యారు. కారు కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు కారు డోర్లు తీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో కారుని ఒడ్డుకు చేర్చి చూడగా ఏడుగురు మృత్యువాత పడినట్లు గుర్తించారు. కారు నడుపుతున్న నాంసింగ్ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అతివేగంగా ప్రయాణిస్తుండటంతో అదుపు తప్పి ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాంసింగ్ నర్సాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నలుగురు కూతుర్లు, ఓ కొడుకు..
మృతి చెందిన ధనావత్ శివరాంకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు శాంతి ఇదే మండలం భీమ్లాతండాకు చెందిన నామ్‌సింగ్ తో వివాహం చేశారు. మూడవ కూతురు అనిత (30) ను ఇదే మండలం జెగ్యాతండాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఈ ప్రమాదంలో శివరాంతో పాటు ఆయన భార్య దుర్గమ్మ, ఇద్దరు కూతుళ్లు శాంతి, అనిత, మనువరాళ్లు మమత, శ్రావణి, ఇందులు మృత్యువాత పడ్డారు.
పది నిమిషల్లో ఇంటికి చేరేవారు..
ప్రమాదం జరిగిన స్ధలం వారి నివాసానికి కేవలం ఐదు కి.మీల దూరంలో ఉంది. పది నిమిషాల్లో ఇంటికి చేరుతారనే క్రమంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కబలించింది. దీంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్ధలాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డిలు పరిశీలించారు.
దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన దామోదర, హరీశ్‌రావులు..
ఈ ప్రమాద ఘటనపై జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి హరీశ్‌రావులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూమిని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాఆంగాన్ని మంత్రి దామోదర ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హరీష్‌రావు డిమాండ్‌చేశారు.









