కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు 5శాతానికి పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతాయని ప్రకటించింది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను రూ.10 రూ.60 వరకు పెంచారు.
ఈ క్రమంలో ఎన్ హెచ్ 65 మీదుగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్లిరావడానికి వాహనదారులు భారీ మొత్తంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ హైవేపై రూ. 465 చెల్లిస్తున్నారు. అయితే, ఇకనుంచి (ఏప్రిల్ 1) రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన రూ.25 టోల్ ఛార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూట్ లో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ హైవేపై ఒకవైపు ప్రయాణానికి రూ.310 చెల్లిస్తుండగా, ఇకపై 325 చెల్లించాలి. మినీబస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం కట్టాల్సి వస్తుంది.