తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజున వరాహ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళ తూర్యారావాలు, భక్తుూల జయ ధ్వనుల మధ్య సుదర్శనమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శన చక్రానికి స్నాన విధులు నిర్వహించారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ రాత్రికి నిర్వహించే ధ్వజావరోహణంతో ఈఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాలపై నాలుగు మాడల వీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారిని లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క గరుడ సేవ రోజే భారీగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనానికి దాదాపు 11 గంటల సమయం పడుతోంది.
ఇక శక్తి పీఠాల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ బెజవాడ కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీ దేవి అవతారంలో భక్తులను కనువిందు చేస్తోంది. షోడశ మహా మంత్ర స్వరూపిణి అయిన శ్రీరాజరాజేశ్వరీ దేవిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తన్మయులవుతున్నారు. పరమ శాంత స్వరూపంతో, చిద్విలాసంగా అమ్మ వారు దర్శనమిస్తున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి నిజరూపాలంకరణలో దర్శనమిస్తున్నారు. నందివాహనంపై ఆది దంపతులకు ప్రకరోత్సవం నిర్వహించిన మీదట. శమీ వృక్షం దగ్గర ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నిర్వహించే తెప్పోత్సవంతో శరన్నవరాత్రులకు ముగింపు పలకనున్నారు.