AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త‌మిళ‌నాడు సీఎం ఇంట్లో విషాదం.. ఎంకే స్టాలిన్ బావ మృతి..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టాలిన్ బావ, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మేనల్లుడు మురసోలి సెల్వం మృతిచెందారు. ముర‌సోలి నిన్న (గురువారం) బెంగుళూరులో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి హుటాహుటిన బెంగుళూరుకు బ‌య‌లుదేరారు. మురసోలి సెల్వం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈయ‌న‌ గతంలో తమిళ దినపత్రిక అయిన మురసోలికి ఎడిటర్‌గా పని చేశారు. ఈ ప‌త్రిక ద్వారా ఆ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ప్రజలకు చేరవేసేవారు.

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మేనల్లుడు అయిన మురసోలి కరుణానిధి కుమార్తె సెల్విని పెళ్లి చేసుకున్నారు. మురసోలి సెల్వం కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్‌కు స్వయానా తమ్ముడు. మురసోలి పత్రిక ద్రవిడ మున్నేట్ర కజగం-డీఎంకే పార్టీ అధికారిక గొంతుకగా ప్ర‌సిద్ధిచెందింది. కరుణానిధి ఆలోచ‌న‌ల‌ను జర్నలిజంలో మురసోలి సెల్వం చేసిన సేవలను ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంది.

మురసోలి సెల్వం మృతికి సంతాపంగా డీఎంకే పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా స్టాలిన్ ముర‌సోలీ సెల్వం గురించి త‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు. చిన్న‌ప్ప‌టినుంచే ముర‌సోలీ సెల్వం త‌న‌కు మార్గ‌నిర్దేశం చేశార‌ని ఈ సంద‌ర్బంగా సీఎం స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. త‌న‌కు అన్ని విష‌యాల్లో స‌ల‌హాలు సూచ‌న‌లు అందించేవార‌ని పేర్కొన్నారు. తాను డీఎంకే అధినేతగా ఎదగడంలో మురసోలి సెల్వం పాత్ర ఎంతో ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. త‌ను భుజం తట్టి ప్రోత్సహించినట్లు వివ‌రించారు. మురసోలి సెల్వం మృతి పట్ల చెన్నై ప్రెస్ క్లబ్ తీవ్ర సంతాపం ప్రకటించింది. మురసోలి సెల్వంకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

ANN TOP 10