AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భయం వద్దు.. నిశ్చింతగా ఉండండి.. ప్రజలకు నష్టం జరగనివ్వం..

మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, స్థానికులకు తాను అండగా ఉంటానని టీపీసీసీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌(Madhuyashki Goud) భరోసా ఇచ్చారు. చైతన్యపురి డివిజన్‌ ఫణిగిరి కాలనీలోని సాయిబాబా ఆలయం వద్ద మూసీ పరీవాహక ప్రాంతవాసులతో మధుయాష్కీగౌడ్‌ సమావేశమయ్యారు. స్థానికులు మాట్లాడుతూ తాము ఇళ్లు కోల్పోతామేమోనని ఆందోళనను వ్యక్తం చేశారు. మధుయాష్కీ స్పందిస్తూ.. ఎవరూ భయపడవద్దని వారి చేతిలో చేయి వేసి ధైర్యం చెప్పారు.

మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా మూసీ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అన్నివిధాలుగా ఆలోచిస్తుందన్నారు. మూసీ సుందరకరణ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తుందన్నారు. నగరం లోపల మూసీ వేరని, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్‌(Chaitanyapuri, Kothapet, Nagole) లాంటి శివారు ప్రాంతంలో వేరని పేర్కొన్నారు. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్‌ ప్రాంతాలలో మూసీ చాలా విశాలంగా ఉందన్నారు. ఇళ్లు కోల్పోకుండా.. ఇళ్లులేని వైపు ఎక్కువగా భూసేకరణ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు.

ప్రజల సందేహాల నివృత్తికి ఇక్కడి ప్రాంత వాసులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వద్దకు తానే తీసుకెళ్లి మాట్లాడిస్తానని స్పష్టంచేశారు. ప్రజలతో చర్చించకుండా, ఎవరి ఇళ్లు అన్యాయంగా కూల్చరు అని ఆయన పేర్కొన్నారు. మాజీమంత్రి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ ప్రాంత చెరువులు, కుంటలు మింగేశారని మండిపడ్డారు. కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపడతామని హెచ్చరించారు. చెరువులను చెరబట్టిన అక్రమార్కులపై విచారణ జరిపించడం ఖాయమన్నారు.

ANN TOP 10