(అమ్మన్యూస్, ముంబై):
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ముంబై కొలాబా ప్రాంతంలో నివసిస్తున్నారు రతన్ టాటా. ఇంట్లో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపోటు భారీగా పడిపోవడమే దీనికి కారణమని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హుటాహుటిన ఆయనను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అత్యవసర చికిత్సను అందజేస్తున్నారు.
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాల సారథ్యంలోని డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలోనే డాక్టర్లు రతన్ టాటా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా..
ఈ వార్తలపై రతన్ టాటా స్పందించారు. అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాను రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యానని వివరించారు. వృద్ధాప్యం రీత్యా వచ్చిన స్వల్ప అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నానని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని అన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వస్తోన్న వార్తలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.