AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుతో మల్లారెడ్డి, తీగల భేటీ.. టీడీపీలోకి జంప్‌..!

త్వరలో చేరికకు రంగం సిద్ధం
సర్వత్రా హాట్‌ టాపిక్‌
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ అనూహ్యంగా మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ గూటికి బీఆర్‌ఎస్‌ కీలక నేతలు చేరుతుండటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయ్యారని చెబుతున్నా.. పార్టీలో చేరేందుకేనని సర్వత్రా టాక్‌. ఈ సందర్భంగటా పలు కీలక అంశాలపై బీఆర్‌ఎస్‌ నేతలు చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్‌ అనుమతించాలని చంద్రబాబును నేతలు కోరారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తన ముఖ్య అనుచరులతో గతంలో మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీలో చేరే విషయంపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. తిరిగి సొంతగూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీగానూ పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు మల్లారెడ్డి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబును మల్లారెడ్డి కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే బీఆర్‌ఎస్‌కు బై.. బై చెప్పేసి పసుపు కండువా కప్పుకోనున్నారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

ఖాళీగా టీటీడీపీ అధ్యక్ష పదవి…
మల్లారెడ్డి సంస్థల చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్‌ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరుతానని తన అనుచరులతో మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో ఉన్న పరిచయాలతో ఆయన టీటీడీపీలోకి వెళ్లనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

టీడీపీలో చేరుతాం.. తీగల కృష్ణారెడ్డి
చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలోనే సైబరాబాద్, హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి కొనియాడారు.

ANN TOP 10