AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అయ్యా.. మా సారెక్కడ? కేసీఆర్‌ కనిపించడం లేదంటూ.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
‘అయ్యా.. మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. నియోజకవర్గానికి మేలు చేస్తారని గెలిపించాం.. ఎలాగైనా మా ఎమ్మెల్యే జాడ.. మాకు తెలిసేలా చూడండి.. అలాగే మా ఎమ్మెల్యేను వెతికి.. మా సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోండి..’ అంటూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్‌ రావు గజ్వేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కె. చంద్రశేఖర రావు కనిపించడం లేదంటూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ రావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. గతంలో కేటీఆర్‌ కనిపించడం లేదంటూ.. సిరిసిల్ల జిల్లా పరిధిలో సైతం ఇదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పుడు కేసీఆర్‌ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడం, అది కూడా కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ ఫిర్యాదునివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఎన్నికలలో గజ్వేల్‌ నుంచి పోటీ చేసి 30 వేల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ పోటీ చేయగా.. ఇక్కడి గెలుపు కేసీఆర్‌ కు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే నియోజకవర్గ ప్రజలు, మాజీ సీఎం కేసీఆర్‌ కు విజయాన్ని అందించారు. రాష్ట్రంలో అధికారం చేజిక్క పోయినా.. కేసీఆర్‌ కు ప్రతిపక్ష హోదా కల్పించిన నియోజకవర్గంగా గజ్వేల్‌ ను చెప్పవచ్చు. అయితే గెలిచిన సమయం నుంచి గజ్వేల్‌ నియోజకవర్గం వైపు కేసీఆర్‌ కన్నెత్తి కూడా చూడడం లేదని, నియోజకవర్గ సమస్యలను తాము ఎవరికి చెప్పుకోవాలంటూ శ్రీకాంత్‌ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

శ్రీకాంత్‌ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ కు గజ్వేల్‌ నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని.. కానీ కనుచూపుమేరలో కూడా నియోజకవర్గ ప్రజలకు కనిపించకుండా కేసీఆర్‌ ఉన్నట్లు తెలిపారు. అధికారం పోయినా.. ప్రతిపక్ష హోదా ఇచ్చిన నియోజకవర్గ ప్రజలను కేసీఆర్‌ ఎలా మరిచిపోయారంటూ ప్రశ్నించారు.

సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదా?
నియోజకవర్గంలో గల సమస్యలు పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేగా కేసీఆర్‌ కు ఉందని.. వెంటనే తమ ఎమ్మెల్యేని వెతికిపెట్టి సమస్యల పరిష్కారంకు మార్గం చూపాలని శ్రీకాంత్‌ రావు, పోలీసులను వేడుకున్నారు. గతంలో కేటీఆర్‌ కనిపించడం లేదని రాజకీయంగా చర్చకు దారి తీయగా.. ఇప్పుడు నేరుగా మాజీ సీఎం కేసీఆర్‌ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందడం విశేషం. మరి ఈ ఫిర్యాదు పై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ANN TOP 10