AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోకి త్వరలో పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు : ఎమ్మెల్యే దానం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, తమ కేసు బూచి చూపెట్టి కాంగ్రెస్‌లోకి రావలనుకుంటున్న ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌ పెద్దలు ఆపుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు… కాస్త ఆలస్యం అయినా మిగతా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక పక్కాగా ఉంటుందని.. సీఎం రేవంత్‌ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదంగా ఉండే హరీష్‌ రావు కూడా గాడి తప్పారని, బీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొడుతున్నారని, ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి కి తీసుకెళ్ళానని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారు.

ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది..
కూలగొట్టే ముందు హైడ్రా అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయన్నారు. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఎడ్చిందని… ఈ ఘటన తనకు చాలా బాధ అనిపించిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదని అన్నారు.

నిజనిర్ధారణ కమిటీ వేయాలి..
హైడ్రా కూల్చివేతలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కోరుతానని, హైడ్రా కాస్త ముందే మెల్కోంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్‌ చెప్పలేదా అని ప్రశ్నించారు. అక్రమకట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. అక్రమ కట్టడాలకు బీఆర్‌ఎస్‌ హాయాంలో విచ్చలవిడిగా పర్మిషన్‌ ఇచ్చారని, కూల్చివేతలపై కాంగ్రెస్‌ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సూచించారు.

పేదల ఇళ్లను కూల్చకూడదు..

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. మురికివాడల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పానని.. జలవిహార్, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయన్నారు. మూసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఖాళీ చేయించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇళ్లకు రెడ్‌మార్క్‌ చేయడం కచ్చితంగా తొందరపాటు చర్యే అని అన్నారు. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పిస్తే మంచిదని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని దానం నాగేందర్‌ అన్నారు.

ANN TOP 10