AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ మృతి.. ఆన్‌లైన్ బెట్టింగే కారణమా..?

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తుపాకితో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ (28) 2018లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు ముగించుకున్న బాలకృష్ణ.. వాష్ రూమ్‌ కోసం వెళ్లి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తుపాకీ శబ్దం విన్న తోటి సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే బాలకృష్ణ ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటై ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిసింది. అప్పులు ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ANN TOP 10