మత రాజకీయాలతో లబ్ధికి కుట్ర
ఆజ్యం పోస్తున్న చేస్తున్న చంద్రబాబు
జగన్‌ను దెబ్బకొట్టాలనే నీచరాజకీయాలు
అసలు నిజాలు తేల్చాలని డిమాండ్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టి్టంచిన తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనపై మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి స్పందించారు. లడ్డూ కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటీ? జరిగింది ఏమిటీ? అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. ఇక్కడ జరిగిన అంశాలకంటే రాజకీయ లబ్ధి, మత పరమైన అంశాల చర్చ ఎక్కువగా జరిగి వాస్తవాలు మరుగున పడిపోతున్నాయని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం వాస్తవాలను వెంటనే బయటపెట్టి తిరిగి కల్తీలేని లడ్డూలను భక్తులకు అందించి అలాంటి దోషాలు తిరిగి జగరకుండా పకడ్బందీగా చర్యలు తీసుకొని భక్తులకు భరోసా కల్పించాలని సూచించారు. కానీ అలా కాకుండా చంద్రబాబు దీన్ని రాజకీయం చేయడం, మత ప్రస్తావన తేవడం, జగన్ పేరు ప్రస్తావన చేయటంతో వ్యక్తిగతంగా తనకు కొన్ని అనుమానాలు వస్తున్నాయని అన్నారు. బీజేపీ ఏమైనా చంద్రబాబుతో మతపరమైన రాజకీయాలకు తెరతీస్తుందా అనేది తన అనుమానం అంటూ బయటపెట్టారు. ‘‘ఎందుకంటే బీజేపీ ఎజెండానే ఎప్పుడు ప్రజా సమస్యల చుట్టూ కాకుండా మతపరమైన అంశాల చుట్టూనే ఉంటుంది. ఎమోషనల్‌గా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయడమే బీజేపీ ఎజెండా. పరిస్థితులు చూస్తే ఏపీలో బీజేపీ ఆట మొదలుపెట్టినట్టు అనిపిస్తోంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆ నమ్మకముంది..
ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందన్నారు. రాష్ట్రం విభజన చేసిందనే కోపం అక్కడ ప్రజలకు ఉందని.. అందుకే గత మూడు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడతారని నమ్మకముందన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి దేశ ప్రజలు కచ్చితంగా అవకాశం ఇస్తారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ నేతృత్వంలోనే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీనే పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.
మత ప్రస్తావన వద్దు…
వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు మెజారిటీ ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే భక్తులలో సామాన్య ప్రజల్లో రకరకాల ఆందోళనకు కారణం అవుతోందన్నారు. కల్తీ నెయ్యిని లడ్డూల్లో కలపమని ఏ ముఖ్యమంత్రి చెప్పరని.. అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకెవరైనా. వాళ్లు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళైనా అటువంటి కల్తీ నెయ్యి లడ్డూలో కలపమని చెప్పరన్నారు. ఏపీ రాజకీయాల్లో దయచేసి మత ప్రస్తావన తీసుకురావద్దన్నారు.
బీజేపీ డైరెక్షన్లోనే…
లడ్డూ వివాదం వెనుక బీజేపీ ఉందా అనే డౌట్ పెరుగుతోందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనిది చంద్రబాబు క్రిస్టియన్ అనే ప్రస్తావనను ఎందుకు పదే పదే తెస్తున్నారని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు బీజేపీ డైరెక్షన్లోనే అనేది తన అనుమానమన్నారు. లడ్డు వివాదంలో జగన్‌ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. మత విశ్వాసాలు రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలనేది బీజేపీ ప్లాన్‌గా కనబడుతోందన్నారు. ఏపీకి సంబంధించిన రాజకీయ పార్టీలు లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయకుండా ఈ ఘటనలో దోషులెవరో విచారణ చేసి వారిని శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.