దేశంలోనే తొలిసారిగా జాబ్ గ్యారెంటీ కోర్సులు
18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొరిసారిగా ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో యువతకు భారీగా ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్లు వేస్తున్న సర్కార్.. మరోవైపు ప్రైవేటు సెక్టార్‌లోనూ ఉద్యోగాలు తెచ్చుకునేలా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈమేరకు.. గ్యాడ్యువేషన్ చేస్తున్న విద్యార్థులకు ఈ ప్రత్యేక కోర్సును రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 25) నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
జాబ్ గ్యారెంటీ స్కిల్ కోర్సులు
సంచలన నిర్ణయాలతో పాలనతో తనదైన మార్క్ చూపిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న సర్కార్.. అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఓవైపు.. నోటిఫికేషన్లు వేస్తూ పరీక్షలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ప్రైవేట్ సెక్టార్‌లోలోనూ ఉద్యోగాలు పొందేలా యువతను సిద్ధం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో.. దేశంలోనే సరికొత్త ప్రయోగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోంది. అదే జాబ్ గ్యారెంటీ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టి.. యువతకు ట్రైనింగ్ ఇవ్వాలని యోచిస్తోంది.
గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు.. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రెగ్యులర్ డిగ్రీ కోర్స్‌లతో పాటు, నైపుణ్య శిక్షణను అందించేలా బీఎఫ్ఎస్ఐ (BFSI) కోర్సును కూడా అదనంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 25న) అధికారికంగా ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కోర్సును ప్రారంభం కానుంది.
అయితే.. ఈ ప్రత్యేక కోర్సును అందించే కళాశాల లిస్టును రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి చేత గుర్తించబడిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఈ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు మొదటగా.. ఈ కోర్సు కింద ట్రైనింగ్ ఇవ్వనున్నారు. EQUIPPP అనే సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమానికి రెండున్నర కోట్లు అందించేందుకు ముందుకు రావడంతో పాటు, సీఎస్ఆర్(CSR) నిధులు కూడా సమీకరించనుంది.