AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని హీరోయిన్ ఫిర్యాదు

సెలబ్రిటీల ఆగడాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ తన అసిస్టెంట్‌పై లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యారు.అవకాశాల పేరిట పలుమార్లు లైంగిక దాడి జరిపినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో అందరికీ సహాయం అందిస్తూ.. వీడియోలను పోస్ట్‌ చేస్తుంటాడు.

తాజాగా హర్షసాయిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ… ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ బిగ్‌బాస్‌ ద్వారా ఫేమ్‌ అయిన ఓ యువతి నార్సింగి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. అతనితో పాటు తండ్రి రాధాకృష్ణపై సైతం ఫిర్యాదు చేసినట్టు సమాచారం అందుతోంది.

యువతి ఫిర్యాదుతో హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు యువతి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసి.. కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.2కోట్ల వరకు మోసం చేసినట్లు హర్షసాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై హర్ష సాయి ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే హర్షసాయి స్వీయ దర్శకత్వంలో హీరోగా ‘మెగా’ పేరుతో చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మిత్రశర్మ హీరోయిన్‌గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఇటువంటి సమయంలో హర్ష సాయిపై కేసు నమోదు కావడం ఆయన కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.

ANN TOP 10