AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘గాంధీ’ సాక్షిగా హైటెన్షన్‌.. పోలీసుల అదుపులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఆస్పత్రుల పరిశీలన కమిటీని అడ్డుకున్న పోలీసులు

అరెస్ట్‌లపై కేటీఆర్‌ ఆగ్రహం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు పరిశీలన కోసం బీఆర్‌ఎస్‌ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్యులైన సంజయ్, మెతుకు ఆనంద్, రాజయ్య ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని పార్టీ కోరగా సోమవారం కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లారు.

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమైంది. అయితే గాంధీ ఆస్పత్రిని సందర్శించాల్సి ఉండగా.. పోలీసులు ముందస్తుగా రాజయ్యతోపాటు కమిటీ సభ్యులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

గాంధీ ఆస్పత్రికి తరలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు..
అయితే విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి తరలివెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు సంజయ్, గోపినాథ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా తాము గాంధీ ఆస్పత్రికి వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు ఆపుతుందని కమిటీలోని నాయకులు ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రిలో మా పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా? లేదంటే తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతుందా? అని నాయకులు అంటున్నారు.

ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది?: కేటీఆర్‌
కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు డాక్టర్లతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని కేటీఆర్‌ వెల్లడించారు. అయితే ఈ కమిటీ ఆస్పత్రుల్లో ఇబ్బందులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతుందన్నారు. కానీ నిపుణుల కమిటీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దయనీయమైన స్థితిలో ఉందని, డెంగీ వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇలాంటి వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజాలను దాచలేదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాస్తవాలపై పోరాటం చేసే వరకు ఆగదని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10