బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు ఉప్పల్ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్‌లో 1.75 , వనస్థలిపురంలో 1.40సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రాగల 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి.
దీంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.4డిగ్రీలు, గాలిలో తేమ 65 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.