మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. 156 చిత్రాల్లో 537 పాటలు. 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Amir Khan) అవార్డును చిరుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన డ్యాన్స్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.
నేను ఎదురుచూడనిది లభించింది
‘‘నా శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఒక్క ఫోన్ కాల్ చేసి ఆహ్వానించగానే మిత్రుడు ఆమిర్ ఖాన్ ఈ ఫంక్షన్‌కు రావడం మరింత కలర్‌ఫుల్‌గా మారింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేను ఊహించనిది, ఆలోచించనిది. నేను ఎదురుచూడనిది నాకు లభించింది. దానికి కారకులైన నా దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లకు, అభిమానులకు ధన్యవాదాలు. నటన కంటే ముందు డాన్స్‌లో ఓనమాలు దిద్దినట్లు అనిపిస్తోంది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించిందా అనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్‌పైనే ఇష్టం ఎక్కువ ఉండేది. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్‌సీసీలో చేరాక.. భోజనం పూర్తయ్యాక ప్లేటును కొడుతూ స్టెప్పులేసేవాడిని. తొలి సినిమా రోజుల్లో.. సావిత్రి, నరసింహరాజు, రోజా రమణిలాంటి వారు నన్ను ప్రోత్సహించారు.
ఓ సారి డ్యాన్స్ చేస్తుండగా కాలు జారి కిందపడిపోయాను. వారంతా ‘అయ్యో..’ అంటుంటే నేను సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డ్యాన్స్‌గా మార్చేశా. ఎప్పుడూ రానన్ని ప్రశంసలు దక్కాయి. అది చూసి కో- డైరెక్టర్.. ఒకరు దర్శకుడు క్రాంతి కుమార్‌కు ‘ప్రాణం ఖరీదు’ సినిమా సమయంలో నా డ్యాన్స్ గురించి చెప్పారు. దాంతో, ఆ చిత్రంలో నాకోసం ప్రత్యేకంగా డ్యూయెట్ క్రియేట్ చేశారు. ‘పునాది రాళ్లు’లోనూ డ్యాన్స్ విషయంలో నేను సెంట్రాఫ్ అట్రాక్షన్. ఆ స్కిల్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ.. అప్పటి దర్శక, నిర్మాతలకు డిస్ర్టిబ్యూటర్ లింగమూర్తి నన్ను రికమెండ్ చేేసవారు. నన్ను ఎంపిక చేసుకున్న దర్శక-నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు నా సాంగ్స్‌పై ప్రత్యేక శ్రద్థ తీసుకునేవారు’’ అని అన్నారు.