AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘హైడ్రా’ కొరడా.. కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఒక్క నల్ల చెరువులోనే ఏడు ఎకరాలు ఆక్రమణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
గ్రేటర్‌ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను కాపాడే దిశగా హైడ్రా దూసుకుపోతోంది. ఆదివారం కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ లోని అక్రమనిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు.

నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు..
నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా అధికారులు కూల్చివేయగా.. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 లక్షలు పెట్టి ఫుడ్‌ క్యాటరింగ్‌ స్టాల్‌ను కట్టుకున్నానంటూ ఓ బాధితుడు విలపించాడు. కూకట్‌పల్లి శాంతి నగర్‌లో బాధితుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ప్రాంతంలో 20కి పైగా కమర్షియల్‌ షటర్లు నేలమట్టమయ్యాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా మోహరించారు.

ఏడు ఎకరాలు ఆక్రమణ..
నల్ల చెరువు వద్ద 27 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురవ్వగా.. 25 అపార్టుమెంట్లు, ఒక భవనాన్ని బఫర్‌ జోన్‌ లో నిర్మించారు. ప్రస్తుతం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మురోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ లోనూ హైడ్రా కొరడా విధిలించింది. కిష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్లో చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. సుమారుగా 16 అక్రమ నిర్మాణాలున్నాయని గుర్తించిన అధికారులు.. కూల్చివేతలు ప్రారంభించారు. అవన్నీ ఒక బీఆర్‌ఎస్‌ నేతకు చెందినవిగా గుర్తించారు. కాగా.. హైడ్రా కూల్చివేతలతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఎన్నో ఆశలతో ఇంటికి డబ్బులిచ్చామని, ఇప్పుడు అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు చేపడితే.. తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు.

ANN TOP 10