AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతిశీ.. నిరాడంబరంగానే..

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా  ఆప్‌ నేత అతిశీ (Atishi) ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. అతిశీ చేత ప్రమాణం చేయించారు. కాగా, అతిశీ ప్రస్తుతం ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అతిశీతో పాటు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావ‌త్ మంత్రులుగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ ద‌ళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, అతిశీ తల్లిదండ్రులు, ఆప్‌ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలు తాను నిజాయితీపరుడినని సర్టిఫికెట్‌ ఇచ్చేవరకూ సీఎం పదవిని చేపట్టబోనని ఆయన ప్రతినబూనారు. ఈ మేర‌కు కేజ్రీవాల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలుసుకున్న కేజ్రీవాల్‌ తన రాజీనామా పత్రాన్ని అందించారు. కేజ్రీవాల్‌ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

 

ANN TOP 10