త్వరలో విధివిధానాలు ఖరారు
ఆ దిశగా అధికారులు కసరత్తు
నేడు జరిగే కేబినెట్‌లోనూ కీలక చర్చ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఇళ్లు లేని పేదలందరికీ ఇది తీపి కబురే.. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధి విధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు, విధివిధానాలను వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ పథకాన్ని కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి (పీఎంఏవై) అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. వాటిలో ఇంటి కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 82 లక్షలు, అర్బన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్‌లో 52.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
కాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సుకు మంత్రివర్గం ఆమోదించనుంది. ధరణి కమిటీ చేసిన 54 సిఫారసులపైనా చర్చించి, అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
బీసీ కుల గణన పై చర్చ
అలాగే బీసీ కుల గణనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేరు పెట్టడంపై కూడా కేబినెట్ చర్చించనున్నట్లు తెలియవచ్చింది. హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నారు. పోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించారు. ఈ మూడింటికీ మంత్రి వర్గం ఆమోదముద్ర చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 225 గ్రామ పంచాయ తీలు, ఔటర్ రింగు రోడ్డులోపల ఉన్న మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనంపైనా కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.