కుమారీ ఆంటీ.. ఈపేరు పరిచయమక్కర్లేదు. హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటూ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అయితే వరద బాధితుల కోసం తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కుమారీ ఆంటి. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, వరంగల్ సహా చాలా జిల్లాలు చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే.
దీంతో భారీగా నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రముఖులు, కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చారు. అదే సమయంలో కుమారీ ఆంటీ కూడా తన వంతు సాయం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో ఆమె బుధవారం కలిశారు. ఆ సమయంలో ఆమె వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. అనంతరం వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కు రూ.50 వేలను విరాళంగా అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు. కుమారీ ఆంటీ సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.