AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ సీఎంగా అతిశీ.. ప్రకటించిన ఆప్‌

(అమ్మన్యూస్, ఢిల్లీ ):
ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే మంత్రి అతిశీని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. మంగళవారం సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు.

మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి తన స్థానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం సీఎం పదవికి కేజ్రీ రాజీనామా చేయబోతున్నారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్‌ను కోరగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్‌ ఎల్జీని కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేయనున్నారు.

అన్నీ తానై..
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టై జైల్లో ఉన్న సమయంలో అతిశీ అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్‌ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిశీ నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్‌ కమిటీకి ఆమె చైర్‌ పర్సన్‌ గానూ పనిచేశారు.

ANN TOP 10