జేజేలు పలికిన భక్త కోటి
(అమ్మన్యూస్, హైదరాబాద్)
సప్తముఖ మహా గణనాథుడి 70 అడుగుల భారీ విగ్రహం నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది భక్తుల మధ్య డప్పుల మోతలతో, డీజే గానాబజానాలతో కోలాహలంగా ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు రోడ్లపైకి రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం1.30 ముగిసింది.
కిక్కిరిసిన రహదారులు
అంతకుముందు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా కొనసాగింది. గతంలో ఎన్నడు లేనంతగా భక్తులు భారీగా తరలి వచ్చారు.
తరలుతున్న గణనాథులు..
మరోవైపు జంటనగరాల్లో కన్నుల పండువగా గణేశ్ విగ్రహాల శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. జంటనగరాలన్నీ కాషాయమయం అయ్యాయి. వక్రదంతుడి విగ్రహాలతో కూడిన భారీ ట్రాలీలు, లారీలు, ట్రాక్టర్లతో నిండిపోయాయి. వాటికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఇప్పటికే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.