రూ.30.01 లక్షలకు దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలుగు రాష్ట్రాల్లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే ఠక్కున గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికే ఈ లడ్డూ.. ఈసారి కూడా రికార్డు ధర పలికింది. సోమవారం ఉదయాన్నే చివరి పూజలు అందుకున్న లంబోదరుడు బాలాపూర్ బొడ్రాయి చౌరస్తాకు చేరుకున్నాడు. అనంతరం లడ్డూ వేలం వేయగా.. గత రికార్డులను బద్దలు కొడుతూ 30 లక్షల 1000 రూపాయలకు స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.
రికార్డు ధర..
గతేడాది కంటే ఈసారి 3.01 లక్షలు ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం. వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బును అందజేశారు. రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
గతేడాది రూ.27 లక్షలు..
గతేడాది హైదరాబాద్ శివారు తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి 27 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఆ ఏడాది బాలాపూర్‌కే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది.
వేలంలో కొత్త నిబంధనలు..
లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను పెట్టారు. గతేడాది రూ.27 లక్షలు పలకగా.. ఆ మెుత్తాన్ని డిపాజిట్ చేసిన పలువురు భక్తులు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు కొలను శంక రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
ప్రధానికి అంకితం..
లడ్డూను ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి లడ్డూను అందజేస్తానని చెప్పారు. కాగా, శంకర్ రెడ్డి స్థానిక బీజేపీ నేత. ప్రస్తుతం ఆయన సింగిల్ విండో చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న ఆయన.. లడ్డూను ప్రధానికి అందజేస్తానని చెప్పారు.