AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

600 స్పెషల్‌ బస్సులు.. గణపతి నిమజ్జనోత్సవానికి ఆర్టీసీ సంసిద్ధం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ ఏర్పాట్లు
17న అర్ధరాత్రి 2 గంటల వరకు.. మెట్రో రైళ్లు
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈనెల 17న గణేశ్‌ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర నేపథ్యంలో టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు రెండు రోజుల పాటు జరిగే శోభాయాత్రలకు ఇప్పటికే పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నగరవాసులకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ప్రత్యేక చర్యలు..
హైదరాబాద్‌లో 17న శోభాయాత్రల సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ఇందులలో భాగంగానే భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది. వినాయక నిమజ్జనోత్సవం వేళ ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సజ్జనార్‌ వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో డిపో నుంచి గరిష్టంగా 30 నుంచి కనీసం 15 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకొని గణేశ్‌ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తలకు సూచించారు. దీంతో పాటు ఏ డిపో నుంచి ఎన్ని బస్సులు ఏ ఏ రూట్లలో నడవనున్నాయో కూడా లిస్ట్‌ విడుదల చేశారు.

మెట్రో సైతం..
ఇదిలా ఉండగా, గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. ఈ మేరకు హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌ అండ్‌ టీ సీనియర్‌ అధికారులతో సమావేశమై ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు.

ANN TOP 10