రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలతో వరదలు వచ్చాయని, కానీ, ఈ ఆపత్కాలంలోనూ వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వరద వల్ల సంభవించిన నష్టంపై ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చిందని తెలిపారు. రూ. 10,300 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు వివరించారు. వరద నష్టంపై ఇది వరకే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ రిపోర్టుపై సమాధానం రావాల్సి ఉన్నదని తెలియజేశారు. జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయింది. ఈ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
స్పీడప్ చేయాలే.. మళ్లీ పంట వేసే కాలం సమీపించిందని, ఇప్పుడు సాగు నీటి అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే సాగర్ ఎడమ కాలువ రిపేర్లను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్‌పీ కాలువ, రెడ్లకుంట మేజర్‌కు గండి పడగా.. దీని మరమ్మతు పనులను ఏ స్థాయికి వచ్చాయో పరిశీలించారు. ఆ తర్వాత ముక్త్యాల మేజర్ కాలువ గండి, మఠంపల్లి మండలంలో తెగిపోయిన చౌటపల్లి చెరువు కట్టలకు సంబంధించిన మరమ్మతు పనులనూ మంత్రి ఉత్తమ్ పరిశీలన చేశారు. సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి రూ. 2.10 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రకటించిన ప్రాజెక్టుల పాదయాత్ర కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ.. ఆ పాదయాత్రతో తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వారి ప్రభుత్వం కంటే తమ కాంగ్రెస్ సర్కారు గొప్పగా చేస్తోందని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ముందుగా చెప్పినట్లుగా.. అనుకున్న సమయంలోనే పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, కాంగ్రెస్‌కు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఆదర్శపాలన అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో ఓ చోట సాగర్కాల్వకు గండి పడటంలో మరో రెండు చోట్ల గండి పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటి రిపేర్లకు రూ.9.43 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.