గణేశ్ నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. వినాయక చవితి వేడుకల్లో చివరి ఘట్టమైన నిమజ్జనం వేడుకలకు మండపాల్లోని గణనాథులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. ఈ నెల 17న ఖైరతాబాద్ మహా గణపతితో పాటు పెద్ద సంఖ్యలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని పలు విగ్రహాల శోభాయాత్ర, ప్రధాన ఊరేగింపు, నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు సీపీ సీవీ ఆనంద్. ఈ ఏడాది అదనంగా 10శాతం వినాయక విగ్రహాలు ఏర్పాటయ్యాయన్నారు.
అన్ని రకాల విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 30వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిబంధనలు ప్రకటించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధిలోంచి విగ్రహాలను తీసుకెళ్లే వారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నెంబర్ ను ప్రదర్శించాలని చెప్పారు. ఊరేగింపులో ఎలాంటి రాజకీయపరమైన నినాదాలు చేయడం కానీ బ్యానర్లు ప్రదర్శించడం కానీ చేయకూడదని హెచ్చరించారు. పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తూ వినాయక నిమజ్జనం సజావుగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆర్టీసీ బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించగా, కొన్ని జంక్షన్లలో బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. గణేశ్ నిమజ్జనాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. శోభాయాత్ర నుంచి నిమజ్జనం చేసే ప్రదేశం వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు.