AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మా జోలికొస్తే ఊరుకోం..వచ్చిన వారికి మూడినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

మావాళ్లు ఎవరి జోలికి పోరు.. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా.. ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.. ఆదివారం (సెప్టెంబర్ 15న) రోజు గాంధీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దగ్గరుండి మహేష్ కుమార్ గౌడ్‌కు టీపీసీసీ బాధ్యతలు అప్పగించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ సౌమ్యుడు అని అనుకోవద్దని.. ఆయన వెనుక తానుంటానంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు.. తెలంగాణలో పదేళ్ల తర్వాత వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతు రుణమాఫీ పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని.. ఇచ్చిన మాట మేరకు చేసి చూపించామన్నారు.

ఇక.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయిందని.. అందుకు రకరకాల కారణాలున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 38 నెలలు ప్రజల తరపున నిత్యం పోరాటం చేశానన్నారు. ఇప్పటికి కూడా తాను కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని వివరించారు. మొన్న జరిగింది సెమీ ఫైనల్స్ మాత్రమేనని.. 2029లో ఫైనల్స్ ఉన్నాయన్నారు. మోదీని ఓడించి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

 

ANN TOP 10