(అమ్మన్యూస్, హైదరాబాద్):
వినాయక విగ్రహాల నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బారికేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి విగ్రహాలను నిమజ్జనం చేశారు. అనేక ఏళ్లుగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనం జరుగుతోందని.. ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని ఉత్సవ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022, 2023లో కూడా ఇలాగే చేశారని, చివరకు ట్యాంక్‌బండ్‌లోనే గణేశ్ నిమజ్జనాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌ఫై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేస్తామన్నారు.
నగరాన్ని స్తంభింపజేస్తాం..
‘ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం వెంటనే గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపజేస్తాం. ఎక్కడికక్కడా మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’ అని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.