AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో పుణ్యక్షేత్రంలా ఖైరతాబాద్‌!

– మహాగణపతిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు
– ఆఖరిరోజు భారీ సంఖ్యలో బారులు
– 17న నిమజ్జనానికి ఏర్పాట్లు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఖైరతాబాద్‌.. మరో పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. మహా గణపతిని ఇప్పటికే లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఆఖరి రోజుకు, ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ గణేష్‌ వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఖైరతాబాద్‌ భక్త జనసంద్రంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్‌ గణేష్‌ సన్నిధిలో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. బడా గణేష్‌ దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఖైరతాబాద్, లక్డికాపూల్, మెట్రోస్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఖైరతాబాద్‌ రైల్వే ట్రాక్, ఐమాక్స్, లక్డీకపూల్‌ మార్గాల్లో గణేష్‌ దర్శనానికి భక్తులు వస్తున్నారు. అతిపెద్ద వినాయకుడు కావడంతో స్వామివారిని చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు దర్శనానికి క్యూలైన్‌లో 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.

నిమజ్జనం ఇలా..
ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్‌ 17 మంగళవారం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలలోపు ఖైరతాబాద్‌ బడా గణేష్‌ నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఉదయం 6.30 గంటల వరకు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామన్నారు.

ANN TOP 10