ఇటీవల ఊహించని రీతిలో తెలంగాణను ముంచెత్తిన వరదల వల్ల నష్టపోయిన ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం ఉదారంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం భేటీ అయ్యారు. వీలున్నంత త్వరగా సాయం అందిస్తేనే వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, నిబంధనలను పక్కనబెట్టి, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఊహించని విపత్తు ఇది..
ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని, సీఎం తెలిపారు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమై కాలనీలే నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఇండ్లు, పంటలు నష్టపోయి భారీగా నష్టపోయిన వారిని మానవీయ కోణంలో కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
సీఎం సూచనలు ఇవే..
తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.