సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక(6)పై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడికి మరణ శిక్ష విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం, జమోయి జిల్లాలోని సికిందర్ ప్రాంతానికి చెందిన గఫాఫర్ అలీఖాన్(61) బీడీఎల్ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదిత్రి కన్‌స్ట్రక్షన్‌లో కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు గత ఏడాది అక్టోబర్ 16న చైతన్య కంపెనీ సెక్యూరిటీ గార్డు వద్ద తమ మనుమరాలుని ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్‌అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.
11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్‌డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్‌డ్రింక్ తాపి పత్తి చేనులోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని అక్కడే చిన్నారిని హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్ భానూర్ ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి చార్జ్‌షీటు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు విన్న స్పెషల్ పోక్సో జడ్జి జయంతి.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షను విధిస్తూ, నిందితుడి కుటుంబ సభ్యులు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాల్సిందిగా తీర్పును వెల్లడించారు.
27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణ శిక్ష
27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్షను కోర్టు విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరితగతిన కేసును పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, స్పీడ్ ట్రయల్ చేసి కేవలం 11 నెలల వ్యవధిలో నిందితుడికి మరణ శిక్షను విధించినట్లు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్‌ఐ, విచారణ అధికారులు, పీపీలు అనంతరావు కుల్‌కర్ణి, కృష్ణ, భరోసా లీగల్ సపోర్ట్ రిసోర్స్ సౌజన్య, కోర్టు డ్యూటీ అధికారులు వెంకటేశ్వర్లు, రఫీక్ , సీతానాయక్, లైజినింగ్ అధికారి సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ రమేష్‌ను అభినందించారు. సమావేశంలో అడీషనల్ ఎస్పీ సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.