కౌశిక్‌రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్ లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి దాడికి పాల్పడగా అరెకపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయన అనుచరులను సైతం అక్కడినుంచి తరలించారు.
ఇది హత్మాయత్నమే.. కేటీఆర్
ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటన్నారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ మండిపడ్డారు.
ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం..
కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్‌ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.