AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాపాలన దినోత్సవం.. ‘సెప్టెంబర్‌ 17’కి కొత్త పేరు.. రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు
నగరంలో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 17వ తేదీకి కొత్త పేరు పెట్టారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించింది. ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు వెల్లడించింది.

చరిత్రలో మరిచిపోలేని రోజు..
సెప్టెంబర్‌ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ.. నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన హైదరాబాద్‌ సంస్థానం.. భారతదేశంలో కలిసిన రోజు. అయితే ఈ సెప్టెంబర్‌ 17వ తేదీ అనేది ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న సెప్టెంబర్‌ 17వ తేదీ విషయంలో మాత్రం.. ఈ రచ్చ తప్పడం లేదు. ఇక ఈ రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటుంది.

జిల్లాల్లో మంత్రులు..
ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సెప్టెంబర్‌ 17 ఏర్పాట్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక రాష్ట్రంలోని మిగతా 32 జిల్లాల్లో కూడా మంత్రులు జెండాలు ఎగురవేసి.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ క్రమంలోనే 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపిన విషయం విదితమే.

ANN TOP 10