ఎవరైనా అమ్మాయి అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. మరి అలాంటిది ఓ నెమలే ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యం చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించడం సాధ్యమేనా? నిజం చెప్పాలంటే వర్ణించడం కష్టమే. ఎందుకంటే నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు.
ఇక విషయానికి వస్తే.. నల్లమల్ల అడవుల్లోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇలాంటి దృశ్యమే కనిపించింది. పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో అందమైన నెమళ్లు.. నడిరోడ్డుపై పురి విప్పి నాట్యం చేశాయి. నెమళ్లు పురివిప్పి ఆడుతున్న దృశ్యాలు పర్యాటకులను ఎంతో ఆకర్షించాయి. ఆ రమణీయ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అంటున్నారు.