ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్‌లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.