వినాయకచవితి ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తోపాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. శనివారం నుంచి ఈ నెల 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
- ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.
- పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లైన్‌లోకి అనుమతించరు.
- ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.
- ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు.
- నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.
- ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేను ఖైరతాబాద్ రైల్వే గేటు వైపు అనుమతించరు.
- నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు వాహనాల కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ంగ్ సదుపాయం కల్పించారు.