సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి తనదైన మార్క్ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలో విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజుల క్రితమే కొత్తగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా.. ఇప్పుడు విద్యా కమిషన్‌తో పాటు బీసీ, వ్యవసాయ కమిషన్లకు ఛైర్మన్లను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది.
కాగా.. బీసీ కమిషన్ ఛైర్మన్‌గా జి. నిరంజన్‌ను ప్రకటించగా సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిని నియమించింది. వ్యవసాయ కమిషన్ ఛైర్మన్‌గా సీనియర్ నేత కోదండ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇక.. విద్యా కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా.. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిష్టాత్మకమైన పాలసీ తయారీకి ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సమయంలో.. మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక రూపు తీసుకురావటంతో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే.. ఆకునూరి మురళి సేవలను తెలంగాణ విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. ఆయనను విద్యా కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంపై అపార అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యా కమిషన్ ఛైర్మన్‌గా నియమించటంతో.. ఏపీలోని విద్యావ్యవస్థలో వచ్చినట్టుగానే తెలంగాణలోనూ సమగ్ర మార్పులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఆకాంక్షిస్తున్నారు.